Make your own free website on Tripod.com

Vijayagopal's Home Page

Maro Kumbha Vrishthi loga!

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

An article written after the deluge in Hyderabad city

 

మరోకుంభవృష్టిలోగా

 మేఘాలు మనకు  బంధువులు. వర్షాలు మనకు పండుగలు. వానలొచ్చాయంటే ఆ సంవత్సరానికి మనకి బ్రతుకుదెరువు గ్యారంటీ అన్నమాట. వానా! వానా! వెళ్ళిపో! అని ఇంగ్లీషు బడిలో పాట నేర్పిస్తే అదేదో వానలు అవసరంలేవనుకునే వాళ్ళపాట గానీ మనది కాదని మనకు తెలుసు. కానీ ప్రస్తుతానికి మనం కూడా వానా!  వానా! ప్రస్తుతానికి వెళ్ళిపో అనే చోటికి వచ్చాం.

వెనకటి టీ వీ లేని కాలంలో సినిమాలకు ముందు న్యూస్ రీల్ చూపించేవారు. అందులో ఒక భారీ గొంతు, మరింత భారీగా `బీహార్ వరదలు! లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు'' అని చెప్పడం గుర్తుంది. తరువాత మన తీర ప్రాంతాల్లో  తుఫానులు, గుర్తున్నాయి. అయితే ఈ సంవత్సరం ఏకంగా రాష్టర్రాజధానిలోనే  వరదలు వచ్చేశాయి. వర్షాలు రావనుకుని  కాలువలు, చెరువులు, దొరువుల్లో కట్టుకున్న ఇళ్ళన్నింటినీ ముంచేంతగా  వర్షాలు, వరదలు వచ్చేశాయి. ఇక చాలు బాబో అనే దాకా వర్షాలు వచ్చాయి. వర్షమంటే భయం పుట్టేంతగా వర్షాలు వచ్చేశాయి.

 

 ఈ ప్రపంచంలో  మొత్తం మీద ఒక సంవత్సరంలో 100 సెంటీమీటర్ల వానకురుస్తుందట.  అయితే ఈ మొత్తం అంతటా ఒకే రకంగా ఉండదు. ఇది సగటు సంఖ్య. జంట నగరాల్లో వరద వచ్చిన రోజున 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజానికి ఈ ప్రాంతంలో  వర్షాలు బాగా కురిసాయనుకున్న సంవత్సరంలో మొత్తం వాన 50 సెంటీమీటర్ల దరిదాపుల్లో ఉంటుంది.

 ప్రపంచం మొత్తం మీద చూస్తే భూమధ్య రేఖా ప్రాంతాల్లో , ఆ తర్వాత  ఋతుపవనాల వల్ల వానలు కురిసే దక్షిణ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువ వానలుంటాయి.  నిజానికి చాలా ప్రదేశాల్లో మనకున్నట్లు ప్రత్యేకంగా వానాకాలమంటూ ఒకటి ఉండనే ఉండదు.

భూమి ఉపరితలం ఒక క్రమంగా కనుక ఉండిన పక్షంలో  సగటు వర్షపాతం అక్షాంశాల మీద ఆధారపడి ఉండేది.  కానీ నేల, సముద్రం విస్తరించిన తీరు, వాటి మీదుగా గాలులు వీచే తీరు,  ఆ గాలికి కొండలు అడ్డు తగిలే తీరు, అన్నీ కలిసి వర్షపాతాన్ని  కావలసినంత మారుస్తున్నాయి. గాలి తేమను గ్రహించి పైకెగేసే ప్రాంతాల్లో  వానలు కురుస్తాయి. కిందకు దిగుతూ పొడిబారే ప్రాంతాలు ఎడారులవుతాయి.  ఉష్ణ మండల ప్రాంతాల క్రింద భాగంలో వ్యాపార పవనాల వల్ల, ఖండాల తూర్పు అంచులకు మంచి వానలందుతాయి.  అదే పడమటి తీరాలు పొడిగా ఉంటాయి.

మనదేశంలో  వర్షం కేవలం  ఋతుపవనాల  ప్రభావం వల్లనే కురుస్తుంది.  సముద్రాలు, ఖండాల మీదుగా  గాలి వీచే తీరే  ఋతుపవనాలంటే! ఉత్తరార్ధగోళంలో చలి కాలంలో చల్లని పొడిగాలి దక్షిణంగా వీస్తుంది. దీని వల్ల వర్షం కురిసే వీలు లేదు. ఈ గాలి ఉష్ణమండలపు సముద్రాల మీద  కొంత దూరం వీచేసరికి భారీ వర్షాలకు కారణమవుతుంది.

 ఇటువంటి వాన తీరు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో లేదు.

వానరాకడ, ప్రాణం పోకడ తెలీదనుకునే వాళ్లు! రాను రాను పరిస్ధితి మారింది. మేఘాలు ఎక్కడెక్కడ ఎంత మేరకు ఉన్నాయో ముందే తెలుసుకునే హెచ్చరికలు, తగు ఏర్పాట్లు చేసుకునే వీలు టెక్నాలజీ పేరుతో మనకు అందుబాటులోకి వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలను ప్రజలు, ప్రభుత్వాలు కలిసి  ఎదుర్కొనే తీరులో పెద్ద మార్పులు వచ్చాయి. అంటే వైపరీత్యాలు మనిషి అదుపులోకి వచ్చాయనడానికి లేదు. కానీ, జరిగే నష్టాలను చేతనయినంత  తగ్గించుకునే  వీలు మాత్రం తప్పకుండా కలుగుతోంది. అది తుఫానుగానీ, వరదగానీ, మరొకటిగానీ,  ముందు సూచనలు వీలవుతున్నాయి.  మనదేశం ప్రయోగించిన  బహుళార్ధసాధక ఉపగ్రహాల ద్వారా వాతావరణ పరిశీలనలో  మరే దేశానికీ తీసిపోనంత కృషి జరుగుతోంది. అయినా విపత్తు సమయంలో  నష్టం ఎక్కువగానూ, జరిగిన మేలు తక్కువగానూ ఉంటున్నది.  ఎంత చేసినా అది తక్కువే అనిపిస్తుంది. లేకుంటే అది విపత్తేకాదు.

ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సూచనల్లో మూడంచెలున్నాయి. ఇవి కేవలం జరగబోయే విషయాలను సూచించి  ఊరుకునే పరిస్థితులు కావు.

అసలు ముందుగా జరగబోయే ఉత్పాతాన్ని  సరిగ్గా అంచనా వేయగలగడంతో కార్యక్రమం మొదలవుతుంది.  ఈ ముందు సూచనలు సాంకేతిక శాస్త్రం ఎంత పెరిగినా  కొన్ని గంటల ముందు మాత్రమే  అందుతాయి. వాతావరణం తీరే అంత! సూచనలు అందిన తర్వాత వాటి వివరాలను సరయిన వారికి సరయిన తీరులో, సకాలంలో  అందచేయడం రెండవ అంచె. విపత్తు వస్తే రావచ్చు. రాకనూ పోవచ్చు. వస్తే రావచ్చనే సూచన సకాలంలో అందాలి. `భారీ వర్షం కురిసే అవకాశం ఉంది'' అంటుంది సూచన. ఈ సూచనను అధికారుల  నుంచి ప్రజలకు సరయిన విధంగా అందజేయడంలో రేడియో, టెలివిజన్లకు ప్రధానపాత్ర ఉంది.

సమాచారం, సూచనగా అందిన తర్వాత దాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవడం మూడవ అంచె. ఇందులో ప్రభుత్వ యంత్రాంగానికీ, స్ధానిక ప్రజానీకానికీ,సేవా సంస్థలకు మంచి అవగాహన, సమన్వయం ఎంతో  అవసరం. సూచన ఎంత బాగా, సకాలంలో వచ్చినా, దాని తర్వాత జరగవలసిన తంతు సరిగా జరగకపోతే లాభం ఉండదు.

వరదలను గురించి ముందు సూచనలు చేయడం ప్రపంచస్ధాయిలో 1800 ప్రాంతాల్లో మొదలయ్యింది.  మన ఇన్సాట్ లాంటి ఉపగ్రహాలు వచ్చిన తర్వాత ఈ విద్య వందరెట్లు మెరుగయ్యింది. దివిసీమ ఉత్పాతం నాటికి మనకంటూ స్వంత ఉపగ్రహాలు లేవు. ఈ తర్వాత వరదల నష్టం తగ్గడం మనందరం ఎరిగిన విషయమే.

వరదలు రెండు రకాలు. నదులు పొంగి పక్కనుండే ప్రాంతాలను ముంచెత్తడం ఒక రకమయితే జంటనగరాల్లో వచ్చిన లాంటి వరదలు రెండవ రకం. ఈ రకాన్ని ఫ్లాష్ఫ్లడ్‌‌స అంటారు. అంటే   మెరుపులా చిటికెలో ముంచుకువచ్చే రకమని  చెప్పుకోవాలి.  ఒక ప్రాంతంలో  కురిసే  మొత్తం వర్షం, ఆనీరు అక్కడి నుంచి  ప్రవహించి వెళ్ళిపోయేదారులు, అనే రెండు అంశాలు ఈ రకం మెరుపు వరదల్లో ముఖ్యంగా గమనించదగినవి, వర్షం తర్వాత కొంత నీరు నేలలో ఇంకుతుంది.  మిగిలింది ప్రవాహంగా గుంటలకు చేరుతుంది.  అవి నిండితే కాలువలయి లోతట్టు ప్రాంతాలకు పారుతుంది. నీరు ఎక్కువయి, ప్రవహించే కాలువలు నిండిపోతే, వరదయి చుట్టుపక్కల ఉంటే లోతట్టు ప్రాంతాలలోకి ప్రవేశిస్తుంది.

 వరదరావడం వింత కాదు. మనం ఊహించగలిగిందే. అయితే అనుభవం మనల్ని తప్పుదారి పట్టిస్తుంది.  కొంతకాలంగా, సంవత్సరాలుగా జంటనగరాల్లో చెప్పుకోదగ్గ వానలు లేనేలేవనాలి. నిన్నటి దాకా మంచి నీటికి కటకటపడిన ప్రాంతమిది. అందుకే  చెరువులన్నీ, కనీసం కొన్నయినా జనాశ్రాయాలయ్యాయి.  కాలువల లోపల, గట్టువెంట కూడా ఇళ్లు వెలిశాయి. ఇవి మురికి వాడలు, గుడిసెలయితే  ఒక తీరు. హుసేన్సాగర్ నుంచి  బయలుదేరే కాలువకు ఇరువైపులా  భవనాలు, ఫ్లాట్స్ కూడా కట్టుకున్నారు. చెట్లుకొట్టేశారు. నగరంలో కనిపించిన ప్రతి అంగుళం నేలను సిమెంటుతో కప్పేశారు. అంతటా రాచబాటలే, అంతటా భవనాలే. ఇక నీరు ఇంకేది, ప్రవహించేది వీటి మీదనే గదా!

వర్షం నీళ్ళను చేతనయినంత ఆదా చేసుకోవాలనుకుని అందుకు సిద్ధమవుతుంటే, కనీ వినీ ఎరుగని రీతిగా వర్షం వచ్చింది. నీళ్ళను  చూస్తే భయం పుట్టే రీతిగా ఎటుచూసినా  నీరే అయింది.  ఒక్క సారి వెన్ను చరిచి తన బలం  చూపించింది నీరు. ప్రకృతిని కొంచెం తక్కువగా అంచనా  వేసి మనం చేసిన కొన్ని పనుల వల్ల ఇప్పుడు కలిగిన నష్టం చాలా ఎక్కువయింది.

వర్షం వస్తోందని  ముందే తెలిసినా, నష్టాన్ని  పూర్తిగా ఆపగలిగే అవకాశమేలేదు. అక్కడికీ ప్రాణనష్టం తక్కువగానే జరిగినట్లు లెక్క. మళ్ళీ ఇలాంటి వర్షం వస్తుందా? రాదనడానికి ఏమిటి ఆధారం?  ఆలోగా  ఎక్కడయినా పొరపాటు జరిగిందేమో చూడాలి. చేయగలిగిందేమిటి అని ఆలోచించాలి! వానరాకడ, ప్రాణంపోకడ ఇప్పటికీ తెలియనట్లే లెక్క!

 

 

Are we wiswer now?